26, అక్టోబర్ 2009, సోమవారం


నా కొత్త పుస్తాకాలు ఇవ్వను,అలానే పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను అని నేనంటే కొంత మంది నా పై కోపగించుకొన్నారు.నా అనుభవం ఈ విషయంలో చాలా చేదు అనుభవం. చాలా మందికి మంచి పుస్తకాలు అరువిచ్చి నష్టపోయాను. ఆ పుస్తకాలు,పత్రికలు నాకు మళ్ళా దొరకలేదు. ఒక సారి 1941 సంవత్సరపు ఆంధ్రపత్రిక దిన పత్రిక (అంటే నే పుట్టిన ఏడాది అన్నమాట) నా దగ్గర నా బ్యాంకు కొలీగ్ చూసి చదివి ఇస్తానని ఎన్ని సార్లు ఆయన ఇంటి ఛుట్టూ తిరిగినా రేపు రేపంటూ చివరికి "ఈ రోజు పేపరు రేపటికి పనికి రాదు,ఎప్పటిదో తాతలనాటి పేపర్ కోసం అంత ఇదై పొతావేం,మా వాళ్ళు పాత పేపర్లతో అమ్మేసారు,సారీ"అన్నాడు.అప్పటి నుంచి ఎవ్వరికీ నా పుస్తకాలు ఇవ్వకూడదనే ఖఠిన నిర్ణయం తీసుకున్నాను తప్పంటారా?నా దగ్గర 1914 నాటి "ది ప్రాక్టీస్ ఆఫ్ ఆయిల్ పైంటింగ్", 1928 నాటి స్టడీస్ ఇన్ ది సైకాలజీ ఆప్ఫ్ సెక్స్,(హావ్లాక్ ఎల్లిస్),ఆంధ్ర గ్రంధమాల (ఆంధ్రపత్రిక)వారి కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిష్టో(సూరంపూడి సీతారాం) అనువాదము,ఆంధ్ర వారపత్రిక (1954) పిల్లల దసారా ప్రత్యేక సంచిక(ఇందు లోనే మా చెల్లి కస్తూరి గీసిన "నేను మా సంగీతం మాస్టారు" బొమ్మ కి బహుమానం వచ్చింది.నే వేసిన బొమ్మ తిరిగొచ్చింది)1953 నుంచి చందమామ పత్రికలు,1944 రీడర్స్ డైజస్ట్ (మా నాన్న గారు కొన్న మొదటి సంచిక)ఇలా ఎన్నో పుస్తకాలు పత్రికలు,బాపురమణ గార్ల దాదాపు అన్ని పుస్తకాలు వున్నాయి. ఇంకా వివిధ కార్టూనిస్ట్ లు ఆర్కే లక్క్ష్మణ్,జయదేవ్,సరసి,రాగతి పండరిల ఈనాడు శ్రీధర్ ల కార్టూన్ పుస్తకాలు చాలా వున్నాయి.నాకు ఈ పుస్తకాలతోనే కాలం ఇట్టే గడిచిపోతుంది.మరో సారి పుస్తకాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతాను(నే పుస్తకాలలో చదివినవే,మీకూ తెలిసే వుంటాయి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి