14, నవంబర్ 2014, శుక్రవారం

జడలు

రచయిత, చిత్రకారుడు శ్రీ బ్నిం తదితర మిత్రులు ఫేస్ బుక్ లో"జడశతకం"
జడపై పద్యాలు అల్లారు. ఈమధ్యనే ఆ జడశతకం పుస్తకరూపంలో కూడా
వచ్చింది. నాకు పద్యాలు రాయడం రాదు కాబట్టి నేను జడ మీద కొన్ని
కార్టూన్ల జడలువేశాను. చిత్తగించండి. 




29, ఆగస్టు 2014, శుక్రవారం

బ్లాగర్ మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. ఇక తరచు కలుద్దాం
కబుర్లు చెప్పుకుందాం

17, ఏప్రిల్ 2014, గురువారం

ఫేసు బుక్కూ ఎంత పని చేశావ్?!


అవునండీ ఫేసుబుక్ లో అడుగుపెట్టాక నేను బ్లాగు వ్రాయడం మరచిపోయాను.
కానీ ఫేసుబుక్ నాకు ఎందరో కొత్త మిత్రులను చేరువ చేసింది. ప్రముఖుల
పరిచయభాగ్యం కలిగించింది. ఇకనుంచి ఫేసు బుక్ తో బాటు నా బ్లాగులో
మిత్రులను తరచు కలుసుకోవడానికి మళ్ళీ కృషి చేస్తాను. బాపుగారు ఆ మధ్య
నాకు ఉత్తరం వ్రాస్తూ ఫేసు బుక్ బొమ్మను ఇలా గీసి పంపించారు. మళ్ళీ కలుద్దాం!
ఇప్పటికి ఉంటా!టాటా!!

27, జూన్ 2013, గురువారం

ఈరోజు మన బుడుగు పుట్టినరోజుర్రోయ్ !!


                బుడుగు వెంకట రమణగారి పుట్టినరోజు పండగంటే హాస్యాభిమాను
లందరికీ పండుగే.  ఋణానందలహరిలో ఆయన హీరో అప్పారావు
పేరే నాపేరైనందుకు ఇప్పుడు నాకెంత ఆనందమో !! చిన్నప్పుడు
నాకు మా తాతగారి పేరు (ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు)
అప్పారావు పేరు పెట్టినందుకు తెగ బాధపడిపోయేవాడిని. స్కూల్లో
చాలా మంది పేర్లు కృష్ణ అనో, రామారావనో, ప్రభాకర్ అనో,రవి అనో
వుండేవి. తరువాత పెద్దయ్యాక మా రమణగారి హీరో పేరు ముందు
చూపుగా మా అమ్మ నాన్నగారు పెట్టినందుకు కాలరెత్తుకుంటున్నాను.
తన హీరో పేరయినంద్కే నేమో రమణగారికి నేనంటే అంత ప్రేమ.

             రమణగారి మాటలన్నీ ముత్యాలమూటలే!! ఎన్నని చెబుతాం !!
ఒకటా రెండా ? ఋణానందలహరిలో నాయకుడు నా చేత (సారీ)
అప్పారావు చేత ఇలా అనిపిస్తారు. 
        "మంచీ చెడ్డా అనేవి రిలెటివ్. మనిషికీ మనిషికీ
         వుండే చుట్టరికాన్ని బట్టి వుంటాయి. నేనంటే మీకు
         గిట్టనప్పుడు నాకు మంచిదైంది మీకు చెడ్డది"
అందులోనే రమణగారు జంతువుల భాషను చెప్పారు !!
       కాకివి  "కావు కేకలు" అవి ఆవులిస్తే "కావులింతలు"
       కాకులకు "రెక్కాడితేగాని డొక్కాడదట"
ఇక చీమల భాష :
        చీమలవి " చిమ చిమ నవ్వులు" మన ముసి ముసి
నవ్వులన్నమాట! పాములు ఒకరితో ఒకరు " దోబుసలాడు
కోవడం"! అవి " కొంపదీసి" అనవట! వాటి భాషలో ఐతే "పుట్ట
తీసి" అని అంటాయట! ఇలా ఎన్నెన్ని చమత్కారాలో !!

   శ్రీ బాపు, శ్రీ రమణల మొదటి సినిమా " సాక్షి " లో నాయకి
చుక్క ( విజయనిర్మల) నోట ఈ మాటలనిపిస్తారు.
    "మంచోళ్ళు, సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు
     మావా! మంచీ సెడ్డా కలిస్తేనే మనిసి"

        ఆంధ్రసచిత్ర వార పత్రికలో నవంబరు 1956 నుండి
ఏప్రియల్ 1957 వరకూ వచ్చిన "బుడుగు-చిచ్చుల
పిడుగు" ఆబాలగోపాలాన్ని అలరించింది. బుడుగు
అచ్చయిన రోజుల్లో బాపు బొమ్మలు తెలుసుగానీ
రచయిత ఎవరో మాకు తెలియదు. సీరియల్ ముగింపు
సంచికలో పై బొమ్మ అచ్చు భుడుగు మాటల్లాగే వేశారు.


                    రమణగారికి కాస్త ఒంట్లో నలతగా వున్నప్పుడు నేను
ఫోను చేస్తే నవ్వుతూ " ఒళ్ళు కాస్త రిపేరు కొచ్చిందండీ"
అనేవారు. ఆయన వాసే ఉత్తరాల్లోనూ చమత్కారమే.
బాపుగారి సంతకం కూడా ఆయనే చేసేసి Authorised
forgery అని వ్రాస్తారు. మా రమణగారికి పుట్టిన రోజు
జేజేలు.

5, ఏప్రిల్ 2010, సోమవారం

ఎందరో భక్తులు-అందరికీ 100నములు!!



ఎందుకోగాని ఈ రోజుల్లో జనాలకి భక్తి ఎక్కువయింది.ఏ గుడి చూసినా ఏ రోజైనా
కిటకిటలాడుతున్నాయి. దేవాలయాలే కాదు, ప్రతి పేవ్మెంట్ పైనా అడుగడుగునా
ప్రత్యక్షమయ్యే గుళ్ళ దగ్గరా దండాలెడుతూ జనం కనిపిస్తున్నారు.దేవాలయం అంటే
ఓ పవిత్ర ప్రదేశం.ట్రాఫిక్ రొదల్తో, రోడ్డు మీద నడుస్తూ ఉమ్ములేస్తూ తిరిగే చోట
ఇలా గుళ్ళు కట్టడం,అక్కడ పూజలు, భజనలూ చేయడం ఎంతవరకు సమంజసం
అంటారు? ఇక రోడ్డు మీద అడ్డ దిడ్డంగా తిరుగుతూ ఆవులు అగుపిస్తాయి.మఖ్యంగా
మన కార్పొరేషన్ వారి చెత్తకుండీల దగ్గర.వాటి యజమానులు వాటి పాలను పిండుకొని
రోడ్డు మీదకు తోలతారు.మనకు ఆవు గోమాత కాబట్టి అలా పేపర్లు,ప్లాస్టిక్ కవర్లలోని
కూరగయ చెక్కుల్ని తింటూ కనిపించగానే తోక దగ్గర చేతులుంచి దండాలు పెట్టే భక్తులు
అగుపిస్తారు. మన నమ్మకం మంచిదే, అలానే ఆ ఆవు నోటికి కూడా ఓ అరటి పండు
ప్రసాదంగా అందిస్తే మంచిదని మాత్రం తోచదు. మా చిన్నప్పుడు రాజమండ్రిలో ఆదినారాయణ
గారని గుర్తు. పచ్చ గడ్డి కట్టలు తెచ్చి ఓ కూడలిలో వేసే వారు. ఆయన గొంతు వినగానే
ఎక్కడెక్కడి ఆవులూ వచ్చేవి.అప్పుడు ఇంత మీడియా లేదు కాబట్టి అందరికీ తెలిసే అవకాశం
లేక పోయేది.ఇక బైక్ మీద వెలుతూ ఏ సందులోనో దూరంగా వుండే గుడి కనబడగానే
ఆ వైపు కళ్ళు మూసుకొని వేళ్ళ మీద నున్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకొనే భక్తులు చాలా
మందిని మీరు చూసే ఉంటారు.గుడిలో వెలితే క్యూలో వున్న స్త్రీలను,పిల్లలను తోసేసి ముందుకు
వేళ్ళే భక్తుల్ని చూస్తాం.కనీసం దేముని దగ్గరైనా మంచిగా ప్రవర్తించరు.అక్కడ కూడా రాజకీయాల
గురించి, సినిమాల గురించి,పెద్దగా మాట్లాడుతుంటారు.బజార్లో మారనివి,నకిలీవి దేముడు మనల్ని
అడగడు అన్న ధైర్యంతో హుండీలలో వెయ్యడం ఈ మధ్య ఎక్కువయింది.ఈ నకిలీ నోట్ల బాధ
ఏడుకొండలవాడికే తప్పటం లేదని ఈ మధ్యే వార్తల్లో వినిపిస్తున్నది.సాధ్యమైనంత వరకు మంచిగా
వుంటూ , మూగ జీవులకు ఆహారం అందిస్తు ఉండటమే నిజమైన మాధవ సేవ అని మన పెద్దలు
ఏ నాడో చెప్పారు.దేవాలయళ్ళో రద్దీగా వున్నప్పుడు పెద్దవాళ్ళను,పిల్లలూ,స్త్రీలను ముందుగా వెళ్ళే
టట్లు సహాయం చేయడం లాంటి పనులు అలవాటు చేసుకొంటే అదే భగవంతునికి నిజమైన నివాళి.


11, మార్చి 2010, గురువారం

రిక్షాకథ


ఈ బొమ్మలొ రిక్షాపై వున్నది కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. ఈ పొటొ గుంటూరులో తీసిన పోటో.
మన బ్లాగర్ శ్రీ శివరామ ప్రసాద్ గారు, ముళ్ళపూడి వారి కోత కొ0మ్మచ్ఛి కోసం పంపించారు. ఈమ్తకీ అసలు
సంగతి ఏమంటే పూర్వం ఇప్పటిలా ఆటోలు లెనప్పుడు , సైకిల్ రిక్షాల ముందు మనుషులు లాగే రిక్షాలు ఉండేవి.
ఒక మనిషి కూర్చుంటే మరో సాటి మనిషి బరువును లాగడము ఎంతో ఇబ్బంది కరమైన విషయం. ఏమిటొ ఆ
కాలంలో అలా అనిపించేది కాదు. ముఖ్యంగా మా రాజమండ్రి లాంటి ఊర్లలో కొన్ని రోడ్లు మెరకగా ఉంటె ,పాపం
ఎండలో చెమటలు కారుతూ లాగే వాళ్ళు. ఆ పాత రోజులు పోయాయి. ఇప్పుడు ఆటోలు వచ్చేశాయి.ఆ రోజులు
ఆ ఫొటో చూస్తే జ్ఞాపకం వచ్చి మీతో పంచుకోవాలనిపించింది.

16, జనవరి 2010, శనివారం

మేమలా కలిశాం

నాకు ఇవ్వాళ ఆనందకరమైన రోజు. ప్రియ (బ్లాగు) మిత్రుడు శ్రీ శివరామ ప్రసాదు గారు మా ఇంటికి వచ్చారు . ఇంతకాలం బ్లాగుద్వారా మాత్రమె పరిచయమే కాని కలుసుకున్నది లేదు. ఈ రోజు మాత్రం శివ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకుని ఆయన ఆనందించారు, నాకు ఆనందాన్ని ఇచ్చారు. మేము కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అలాఅలా చాల సమయం గడిచిపోయి, అరె ఇంతసేపు మాట్లాడేసు కున్నామా అని ఇద్దరం కూడా ఆశ్చర్య పోయాము. నా దగ్గర ఉన్న పాత కాలపు కీ గ్రామ ఫోను చూసి అబ్బురపడి, అది తిప్పి అందులో పాత వినేంతవరకు వదలలేదు. చివరకు, ఆ గ్రామఫోను సూది వెతికి వెతికి, పదును పెట్టి, పాతకాలపు 78 RPM రికార్డు తిప్పి బాలానందం పాటలు విన్నాము. నేను ఆ రికార్డును మోగించటం తీసాము, అది ఈ కిందే ఉన్నది.

గ్రామఫోను అంటే తెలియని ఈ రోజులలో, కరెంటు అవసరం లేకుండా పూర్తీ యాంత్రిక శక్తితో (గడియారం లాగ కీ ఇస్తే పని చేస్తుంది) నడిచే ఈ వినోద పరికరం తెలియని వారు చూడటానికి ఇక్కడ ఇస్తున్నాను.